లక్నో: గోనె సంచిలో దళిత బాలిక మృతదేహాన్ని గుర్తించారు. (Dalit girl body in sack) ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఒక వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 19న కర్హల్‌లో ఇద్దరు వ్యక్తులు దళిత యువతిని కిడ్నాప్ చేశారు. బెక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు కొందరు చూశారు. అయితే బుధవారం కంజారా నది వంతెన వద్ద ఆ దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో కనిపించింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దళిత యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె హత్య వెనుక రాజకీయ నేపథ్యం ఉందని ఆమె కుటుంబం తెలిపింది. ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతిచ్చినందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ప్రశాంత్ యాదవ్ ఆమెను బెదిరించినట్లు ఆరోపించింది. అతడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.