Civic polls : మహారాష్ట్ర (Maharastra) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల (Civic polls) పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓటర్ల చేతివేళ్లపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వివాదం చెలరేగుతోంది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని బృహన్ ముంబై (Bruhan Mumbai) మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని (Bhushan Gagrani) కూడా అంగీకరించారని విపక్షాలు ఆరోపించాయి.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారుచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. వారు ఎటువంటి అవకతవకలకైనా పాల్పడగలరని మండిపడ్డారు.
అయితే ఈ ఆరోపణలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తోసిపుచ్చింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారనే వార్తలు నిజం కాదని, దీనిపై మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని స్పష్టతనిచ్చింది. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది.