జైపూర్, సెప్టెంబర్ 14: భారతీయ ప్రాచీన సంస్కృతిలోని ఆచారాలలో ఆరోగ్య రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి ఆరోగ్య రహస్యాన్ని తాజాగా వైద్య నిపుణులు గుర్తించారు. పూజలు నిర్వహించినప్పుడు శంఖం ఊదటం అనాదిగా ఆచారంగా వస్తున్నది. ఈ ఆచారంలో ఓ ఆరోగ్య సూత్రం దాగి ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. కొందరికి నిద్రపోయినప్పుడు మధ్యలో కొన్ని సెకన్లపాటు హఠాత్తుగా శ్వాస ఆగిపోతుంది. దీంతో ఊపిరాడనట్టయి నిద్రలో మెలకువ వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో స్లీప్ అమ్నియా అంటారు. రోజూ శంఖం ఊదటం వల్ల మంచి నిద్ర పట్టడంతో పాటు స్లీప్ అమ్నియా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ఈ మేరకు జైపూర్‌కు చెందిన వైద్యనిపుణులు రాసిన పరిశోధన పత్రం యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్, న్యూస్ మెడికల్ లైఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైంది. 19 నుంచి 65 ఏండ్ల వయసు గల వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు కనుగొన్నట్టు వివరించారు. నిద్రలో అంతరాయాల సంఖ్య తగ్గడాన్ని గమనించినట్టు వైద్య నిపుణులు పేర్కొన్నారు. స్లీప్ అప్నియా సమస్యతో బాధపడేవారు ఆక్సీజన్, మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటారు. కానీ శంఖం ఊదడం వల్ల సహజసిద్ధంగానే వాటి అవసరం తగ్గడాన్ని గమనించినట్టు వెల్లడించారు.