చెన్నై, నవంబర్ 22: సరైన వయస్సు, కావాల్సినంత సమయం, అన్ని వనరులున్నా కొందరు ఏమీ సాధించలేకపోతారు. కానీ, అసలే కంటిచూపులోపం.. 52 ఏండ్ల వయసు..కూలి చేయనిదే పొట్టగడవని స్థితిలో ఓ వ్యక్తి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పాసై అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధించాలనే కసి మనలో ఉంటే ఏదీ అడ్డంకి కాదని నిరూపించాడు రవిచంద్రన్. ఆయనది తంజావూరు జిల్లాలోని అళివైకల్ గ్రామం. 1990లో బీఎస్సీ మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నాడు. టీఎన్పీఎస్సీ జారీచేసిన గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాడు.
తోటికూలీ పద్మావతి (65)తో కలిసి పొలం వద్దే ప్రిపరేషన్ కొనసాగించాడు. పద్మావతి గట్టిగా చదువుతుంటే రవిచంద్రన్ పాఠాలను విని ఆకళింపు చేసుకునేవాడు. మే 21న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు. ఓ సహాయకుడితో విజయవంతంగా పరీక్ష రాశాడు. ఇందులో ఉత్తీర్ణత సాధించాడు. ప్రస్తుతం రవిచంద్రన్ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.