ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) శాంతిని నెలకొల్పేందుకు సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రయత్నిస్తున్నారని, కుకీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతున్నారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే ఇది పచ్చి అబద్ధమని 10 మంది కుకీ-జో ఎమ్మెల్యేలు ఆరోపించారు. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మైతీ, కుకీల మధ్య జాతి ఘర్షణ మొదలైన 2023 మే నాటి నుంచి సీఎం బీరెన్ సింగ్ తమతో ఎప్పుడూ సమావేశం కాలేదని కుకీ-జో ఎమ్మెల్యేలు తెలిపారు. మణిపూర్‌లో హింస కొనసాగడానికి, తమ జాతుల ప్రక్షాళనకు సూత్రధారి అయిన సీఎంను భవిష్యత్తులో కూడా కలిసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పది మంది కుకీ ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, మణిపూర్‌లో మైతీ, కుకీ జాతుల మధ్య హింసకు సీఎం పాత్ర ఉన్నట్లుగా కొన్ని ఆడియో క్లిప్‌లు లీకయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు ఈ టేపులను కుకీ సంస్థ సమర్పించింది. అలాగే దీనిపై దర్యాప్తు కోసం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాని సుప్రీంకోర్టును కూడా కోరింది.
మరోవైపు ఈ టేపుల ప్రామాణికతను నిర్ధారించడానికి తగిన ఆధారాలు సమర్పించాలని కుకీ సంస్థను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అయితే రాష్ట్రంలో శాంతి ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి ఈ నకిలీ ఆడియో టేప్‌లను సృష్టించారని మణిపూర్ ప్రభుత్వం ఆరోపించింది.