NSG Black Cats : దేశంలోని ప్రముఖుల భద్రతకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్న బ్లాక్ క్యాట్ కమెండోస్ను ఆ విధుల నుంచి తప్పిస్తున్నారా..? వారి స్థానంలో బాధ్యతలను సీఆర్పీఎఫ్కు అప్పగించబోతున్నారా..? అంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం వీఐపీల భద్రత బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశాన్ని సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందుకు అవసరమైన కసరత్తు చేపడుతోంది. ఇప్పటివరకు వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమెండోలతోపాటు ఐటీబీపీ సిబ్బందినీ ఉపసంహరించనున్నారు. ‘జడ్’ విభాగంలోని తొమ్మిది కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్కు లేదా సీఐఎస్ఎఫ్లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది.
ఉగ్రదాడులు, విపత్తుల సందర్భంగా ‘స్ట్రైక్ ఫోర్స్’గా వినియోగించుకునేందుకు 1984లో ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమెండో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బ్లాక్ క్యాట్ కమెండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012 లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో 450 మంది వరకు బ్లాక్క్యాట్ కమెండోలు ఉన్నారని సమాచారం. వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక.. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా మోహరించనున్నారు.