న్యూఢిల్లీ: కూనూర్‌లో కూలిపోయిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ఫ్లైట్ డాటా రికార్డర్(బ్లాక్ బాక్స్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది తెలుసుకోవడంలో బ్లాక్ బాక్స్ చాలా కీలకం కానున్నది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక కిలోమీటర్ పరిధిలో వెతికి అధికారులు వీటిని గుర్తించారు.
బ్లాక్ బాక్స్ అనేది ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. దీన్ని ఫ్లైట్ డాటా రికార్డర్ అని కూడా అంటారు. ఇది ప్రతీ విమానం, హెలికాప్టర్లో ఉంటుంది. ప్రమాదం జరగడానికి ముందు చివరి నిమిషాల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏం జరిగిందనేదానిపై చాలా కీలకమైన సమాచారం ఇందులో సేవ్ అయి ఉంటుంది. దీని ఆధారంగా ప్రమాదానికి కారణాలను తెలుసుకొని, భవిష్యత్తులో ప్రమాదాలను నిరోధించవచ్చు. సాధారణంగా దీనిని విమానాలు, హెలికాప్టర్ల వెనుక భాగంలో అమర్చుతారు. బ్లాక్ బాక్స్ అంటే చాలా మంది అది నల్ల రంగులో ఉంటుంది అనుకొంటారు. ఇటీవల వీటిని ఆరెంజ్ కలర్లో తయారు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుర్తించేందుకు వీలుగా ఉండాలని అలా చేస్తున్నారు. తొలుత తయారు చేసినప్పుడు నల్ల రంగులో తయారు చేయడం వల్ల వాటికి ఆ పేరు స్థిరపడిపోయింది.
విమానం ప్రయాణిస్తున్నప్పుడు గాలి వేగం, ఎగురుతున్న ఎత్తు, ఇంధనం, రేడియో ట్రాఫిక్ తదితర విషయాన్నీ బ్లాక్ బాక్సులో సేవ్ అవుతాయి. 25 గంటల సమాచారం ఇందుల నిక్షిప్తమై ఉంటుంది. విమానాల్లో బ్లాక్ బాక్స్‌తో పాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది. విమానంలో శబ్దాలను మాత్రమే కాక్‌పిట్ రికార్డు చేస్తుంది. ప్రమాదం జరగడానికి రెండు గంటల ముందు వరకు పైలట్లు, ప్రయాణికులు ఏం మాట్లాడుకొన్నారనేది ఇందులో ఉంటుంది. బ్లాక్ బాక్స్‌ను, కాప్పిట్ను ఒకే బాక్సులో అమర్చవచ్చు. లేదా వేర్వేరుగా అమర్చవచ్చు.