భువనేశ్వర్, మే 21: పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ నోరు జారడంపై బీజేపీ పూరీ అభ్యర్థి సంబిత్ పాత్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ‘నోరు జారాను. క్షమాపణలు కోరుతున్నా. ప్రాయశ్చిత్తంగా మూడు రోజులపాటు ఉపవాస దీక్ష చేపడుతున్నా’ అని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఒడిశాలో మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం నవీన్ పట్నాయక్, వివిధ రాష్ర్టాల సీఎంలు ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.