Taliban mindset Party Akhilesh SP | ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ది తాలిబన్ మైండ్‌సెట్ అని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆప్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు మద్దతుగా ఎస్పీ నేతలు ప్రకటనలు చేసిన నేపథ్యంలో బీజేపీ విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది. 10 రోజుల క్రితం పార్టీ పేరెత్తకుండానే భారత్‌లో కొందరు ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆరోపించారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేరుతో రూపొందించిన వీడియోను బీజేపీ శనివారం ట్వీట్ చేసింది. తాలిబన్ల మైండ్ సెట్ గల కొందరు ఎస్పీ నేతలు ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపణలు గుప్పించింది. రెండు నిమిషాల నిడివితో హిందీ వాయిస్ ఓవర్‌తో కూడిన వీడియోను విడుదల చేసింది.
యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో యూపీలో ఐదేండ్ల క్రితం అధికారం చేపట్టిన బీజేపీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగేఅసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని కైవశం చేసుకోవాలని ఆశాభావంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆఫ్ఘన్లో పరిణామాల ద్రుశ్యాలతో ఈ వీడియోను రూపొందించింది. బీజేపీ వీడియోపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ గానీ, ఆ పార్టీ నేతలుగానీ స్పందించలేదు. తాలిబన్లపై తమ పార్టీ వైఖరేమిటన్న అంశంపై అఖిలేశ్ యాదవ్ సమాధానం దాటేశారు.
మహిళలు, పిల్లల పట్ల తాలిబన్ల అనాగరిక వైఖరిని చూడండి.. అటువంటి వారిని కొందరు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. వీరి నిజస్వరూపాన్ని బయటపెట్టాలి అని ఈనెల 19న జరిగిన సభలో యోగి ఆదిత్యనాథ్ కోరారు. భారత స్వాతంత్ర పోరాట యోధులతో తాలిబన్లను పోలుస్తూ వ్యాఖ్యలను చేసిన ఒక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీక్యూర్ రెహ్మాన్ బార్క్, మరో ఇద్దరు ఆ పార్టీ నేతలపై దేశ ద్రోహ కేసు నమోదయ్యాక యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తన మాటలను మీడియా వక్రీకరించిందని షఫీక్యూర్ రెహ్మాన్ దాటేశారు.