బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు మాజీ సీఎం జగదీష్ షెట్టార్కు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతరులు బరిలో నిలిచేందుకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలని జగదీష్ షెట్టార్కు పార్టీ అగ్రనాయకత్వం సూచించింది. హైకమాండ్ నిర్ణయంతో జగదీష్ షెట్టార్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
పార్టీ నిర్ణయంతో తాను కలత చెందానని, సీనియర్ నేతకు మొండిచేయి చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జగదీస్ షెట్టార్ తేల్చిచెప్పారు. తనకు టికెట్ కేటాయించేలా పార్టీ అగ్రనాయకత్వం పునఃపరిశీలించాలని కోరానని, త్వరలోనే దీనిపై మాట్లాడతామని కేంద్ర నాయకత్వం తెలిపిందని ఆయన వెల్లడించారు.
కాషాయ పార్టీలో టికెట్ల కేటాయింపు మంటలు రేపుతుందని జగదీష్ షెట్టార్ ఉదంతం సంకేతాలు పంపుతోంది. పార్టీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలపైనా సందిగ్ధత నెలకొంది. రెండు మూడు రోజులుగా తొలి జాబితా విడుదలను అగ్రనాయకత్వం నాన్చడం అభ్యర్ధుల ఎంపిక కొలిక్కిరాకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More