న్యూఢిల్లీ : రిజర్వేషన్లపై కొన్ని వర్గాల్లోని అసంతృప్తి ఓటర్లను శాంతింప చేసేందుకు బీజేపీ నడుం బిగించింది. రిజర్వేషన్ల సంస్కరణలకు సంబంధించి ఆగస్టు 21న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమం అనంతరం, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బృంద సభ్యులైన హర్ష్ దూబే, రాన్ బహదూర్ సింగ్ చౌహాన్, మృత్యుంజయ పాఠక్‌లతో సుహృద్భావ చర్చలు జరిగినట్టు కేంద్ర మంత్రి నడ్డా గురువారం ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. ‘ఈ విషయంలో త్వరలో మళ్లీ కలుద్దాం’ అని ఉద్యమకారులతో అన్నట్టు పేర్కొన్నారు.
అయితే నడ్డా ప్రకటన రిజర్వేషన్ సంస్కరణల ఉద్యమంలోని విభేదాలను బట్టబయలు చేసింది. కార్యకర్త అజీత్ భారతీ నేతృత్వంలోని ఒక వర్గం మంత్రి కలిసిన బృందం నుంచి విడిపోయింది. రిజర్వేషన్ల సంస్కరణల నుంచి సాధారణ వర్గాన్ని మినహాయించి కేవలం రిజర్వ్ కేటగిరీల విద్యార్థులకు మాత్రమే వర్తించే యూజీసీ 2026 సమానత్వ మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఒక వర్గం ఆందోళన నిర్వహించింది. ఇది రిజర్వేషన్ లేని ఓబీసీ వర్గాలను ఒక తాటిపైకి తీసుకువచ్చింది.