Bombay Highcourt | ముంబై, ఆగస్టు 5: బాంబే హైకోర్టు జడ్జీగా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తీ సాథేను నియమించడం పట్ల కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) నేతలు మంగళవారం అభ్యంతరం తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమె పనిచేసిన నేపథ్యంలో, ఆమెను జడ్జీగా నియమించడంమ వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షితపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు. ‘బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి న్యాయమూర్తి అయితే, ప్రజలకు న్యాయం జరుగుతుందా? రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందా?’ అని సీఎల్పీ నేత విజయ్ వాడెట్టివర్ ప్రశ్నించారు. ఆమె పదోన్నతి న్యాయవ్యవస్థ నిష్పాక్షితపై ప్రభావం చూపుతుందని ఎన్సీపీ (ఎస్పీ) ఎంఎల్ఏ రోహిత్ పవార్ పేర్కొన్నారు. కాగా, విపక్షాల విమర్శలను అర్థం లేనివిగా పేర్కొన్న బీజేపీ చీఫ్ కేశవ్ ఉపాధ్యాయ్.. ఆమె గత ఏడాదే పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.
ఇక ఉద్యోగే యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు! ; ఈపీఎఫ్ఓ కొత్త విధానం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్)ని సొంతంగా జనరేట్ చేసి, యాక్టివేట్ చేసుకునే కొత్త విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ప్రవేశపెట్టింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. యూఏఎన్ కోసం తమ యాజమాన్యాన్ని ఆశ్రయించే అవసరం లేకుండా ఉద్యోగులే నేరుగా ఉమంగ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి యూఏఎన్ని జనరేట్ చేసుకోవచ్చు. యాజమాన్యాల ద్వారా యూఏఎన్ని జనరేట్ చేసుకునే సాంప్రదాయ విధానం అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు మాత్రమే కొనసాగుతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉమంగ్ యాప్ ద్వారా మూడు సేవలను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది. యూఏఎన్ లేని ఉద్యోగుల కోసం యూఏఎన్ అలాట్మెంట్, యాక్టివేషన్ సర్వీసు ఏర్పాటైంది.