Eknath Shinde | మహారాష్ట్ర సీఎం-శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండేకు బీజేపీ అగ్ర నాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. 2019లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్‌కు మాదిరిగానే ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టేందుకు కమలనాథులు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ మహారాష్ట్రలో ప్రభుత్వం మారితే ఏక్నాథ్ షిండే, ఆయన ముఖ్య అనుచరులకు మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తున్నది.
2019లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో నాటి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేశారు కమలనాథులు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎంగా.., అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, 80 గంటల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోయింది. ఎన్సీపీని చీల్చడంలో అజిత్ పవార్ సక్సెస్ అయితే, కొన్ని మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆశ చూపినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
2019 నాటి అజిత్ పవార్ తరహాలోనే షిండే తిరుగుబాటు కనిపిస్తున్నది. అజిత్ పవార్ మాదిరిగానే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని సమాచారం. అంతే కాదు.. గరిష్ఠంగా షిండే గ్రూప్‌కు 12 మంత్రి పదవులు లభిస్తాయని వినికిడి. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక మంత్రిత్వశాఖలు శివసేనకు కట్టబెడతారని దీనికి సంబంధించిన చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు.