లక్నో: కొందరు గూండాలు బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఇంటిపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కుటుంబ సభ్యులను కొట్టారు. తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. (BJP MLA’s Cousin Beaten To Death) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే బాబూరామ్ పాశ్వాన్ దూరపు బంధువైన 70 ఏళ్ల ఫూల్చంద్పై కొందరు గూడాలు దాడి చేశారు. శనివారం రాత్రి ఉద్రా గ్రామంలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆయన మనుమరాలిని ఈడ్చుకెళ్లారు. ఫూల్ చంద్‌తో సహా 8 మంది కుటుంబ సభ్యులను గూండాలు కొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని పురాన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫూల్‌చంద్ మరణించాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.