ముజఫర్నగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో బీజేపీ అగ్రనాయకులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉన్నది. ఇటీవల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర భంగపాటు ఎదురుకాగా.. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ అభ్యర్థి విక్రమ్ సైనీకి మద్దతుగా ప్రచారం చేయడానికి బుధవారం ఖటోలికి స్వతంత్రదేవ్ వెళ్లారు. ఓ దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేసి బయటికి వచ్చారు. అక్కడ గుమికూడిన దళితులు స్వతంత్రదేవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పనాజీ నుంచి ఉత్పల్ పారికర్ పోటీ
పనాజీ: బీజేపీకి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి అడుగు జాడల్లో నడవాలని భావిస్తున్నానన్నారు.