లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తన పావుల్ని వేగంగా కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పొత్తు పార్టీలతో సీట్ల పంపకంపై తుది నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనున్నది. అప్నా దళ్, నిషాద్ పార్టీలతో బీజేపీ జత కట్టేందుకు రంగం సిద్ధం చేసింది. బీజేపీని వీడిన చౌహాన్ ఇప్పటికే ఎస్పీలో చేరారు. ఇక ఆయన బాటలోనే మౌర్య వెళ్లనున్నారు. అయితే ఓబీసీ నేతలంతా యోగి సర్కార్‌ను వీడుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అప్నా దళ్‌కు చెందిన కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, ఆమె భర్త ఆశిశ్ పటేల్‌తో పాటు నిషాద్ పార్టీకి చెందిన సంజయ్ నిషాద్‌తో షా చర్చలు నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్‌కు 10 నుంచి 14 సీట్లను, నిషాద్ పార్టీకి 13 నుంచి 17 సీట్లను బీజేపీ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యాదవేతర ఓబీసీ కోటాలో ఈ రెండు పార్టీలు కీలకంగా నిలవనున్నాయి. అప్నా దళ్, నిషాద్ పార్టీలకు చెందిన కొందరు నేతలు.. తూర్పు యూపీలో బీజేపీ టికెట్‌పై పోటీపడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలోని ఓబీసీ నేతలు వీడినా.. చిన్న పార్టీల పొత్తుతో ఆ లోటును తీర్చుకునేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అఖిలేశ్ యాదవ్ మాత్రం సుహేల్దేవ్ పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూపీ మాజీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌బబ్బర్ నేతృత్వంలో సుహేల్దేవ్ పార్టీ కీలక స్థానాలకు పోటీపడుతోంది.