న్యూఢిల్లీ: కేంద్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారయణ్ రాణే ( Narayan Rane ) మహారాష్ట్ర రాజకీయాల్లో బాంబు పేల్చారు. వచ్చే ఏడాది మార్చినెల కల్లా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కొలువు దీరుతుంది. మీరు మార్పును చూస్తారు’ అంటూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు రాణే సమాధానం ఇచ్చారు. నారాయణ్ రాణే కామెంట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
‘మహారాష్ట్రలో త్వరలో మార్పును చూడబోతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో మార్పు కనబడనుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఏవిధంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు అని మీడియా మరో ప్రశ్న వేయడంతో.. ‘ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసేది, ఒక ప్రభుత్వాన్ని ఎలా కూల్చేది చెప్పకూడదు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలి’ అని చెప్పారు.
కాగా, నారాయణ్ రాణే 17 ఏండ్ల క్రితం ఉద్దవ్ థాక్రే నాయకత్వంతో విభేదించి బీజేపీలో చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తేదీ కూడా గుర్తులేనందుకు తాను పక్కన ఉండి ఉంటే ఉద్దవ్ థాక్రే చెంప పగుల కొట్టేవాడినని ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా నారాయణ్ రాణే వ్యాఖ్యానించారు. దాంతో మహారాష్ట్ర సర్కారు ఆయనను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చబోతున్నట్లు సంకేతాలిచ్చి రాజకీయ చర్చలకు తెరలేపారు.