BJP MLAs : ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) పై బహిష్కరణ వేటు పడింది. పార్టీ నియమాలను ఉల్లంఘించారనే కారణంతో బీజేపీ వారిపై వేటు వేసింది. కర్ణాటక (Karnataka) కు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్ (ST Somasekhar), ఎ శివరామ్ హెబ్బర్ (A Shivaram Hebbar) ఆరేసి ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన కేంద్ర క్రమశిక్షణ కమిటీ (BJP Central Disciplinary Committee) తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ్టి వరకు వాళ్లు పార్టీకి సంబంధించిన ఏ పదవిలో ఉన్నా ఆ పదవులన్నింటి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది మార్చి 25న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీ షాకాజ్ నోటీసులు ఇచ్చిందని, ఆ నోటీసులకు వారు సమాధానాలు ఇచ్చారని, వారిచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకునే ఇప్పుడు వారిపై బహిష్కరణ వేటు వేశామని బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ తెలిపింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారని, దానిపై షాకాజ్ నోటీసు ఇచ్చినా వారి నుంచి సరైన సమాధానం రాలేదని, అందుకే ఆ ఇద్దరిపై బహిష్కరణ వేటు వేశామని పేర్కొంది.