Ravindra Kumar Rai : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రవీంద్ర కుమార్ రాయ్‌ని నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అప్పాయింట్మెంట్ లెటర్‌పై సంతకం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాయ్ నిమాయకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అక్కడ అధికార జేఎఎం, కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నడుమ ప్రధాన పోటీ ఉండనుంది. జార్ఖండ్‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. భూ కుంభకోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయించింది.
దాంతో హేమంత్ సోరెన్ తనకు నమ్మకస్తుడైన చంపాయ్ సోరెన్‌ను సీఎంగా నియమించి జైలుకు వెళ్లాడు. అనంతరం హేమంత్ సోరెన్ బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ సీఎం పదవి చేపట్టాడు. దాంతో బీజేపీ నేతలు చంపాయ్ సోరెన్‌కు వలవేసి తమ పార్టీలో చేర్చుకున్నారు. అంతేగాక బీజేపీ నుంచి ఆయనకు ఆయన మనుషులకు టికెట్లు కూడా ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.