BJP | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఐఐటీ-బీహెచ్‌యూలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి అరెస్టయిన ముగ్గురు బీజేపీ కార్యకర్తల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వారణాసి జిల్లా బీజేపీ నాయకుడు ఆదివారం ప్రకటించారు. జిల్లా పార్టీలో ఈ ముగ్గురు కార్యకర్తల పాత్ర, బాధ్యతలేంటన్నది వారణాసి బీజేపీ చీఫ్ హన్స్‌రాజ్ విశ్వకర్మ తెలుపలేదు. ‘పోలీస్ దర్యాప్తులో నిందితులగా ఉన్నందున కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్షం పటేల్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం’ అని అన్నారు.
విద్యార్థినిపై వేధింపుల ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపింది. నిందితులు బీజేపీ కార్యకర్తలు అయినందు వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని, వారిని రక్షించే పని చేస్తున్నదని ప్రతిపక్ష సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
నవంబర్ 2న ముగ్గురు వ్యక్తులు ఐఐటీ-బనారస్ హిందూ వర్సిటీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. వర్సిటీ క్యాంపస్‌లో బైక్‌పై వచ్చిన నిందితులు ఓ విద్యార్థిని బట్టలు విప్పి, వేధింపులకు పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేశారు. ఈ ఘటనతో వర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాడిని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.