అహ్మదాబాద్, జూన్ 18: జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజద్ భట్టీతో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో దానిపై గుజరాత్ ప్రభుత్వం మంగళవారం విచారణకు ఆదేశించింది. వివిధ కేసులలో లారెన్స్ బిష్ణోయ్ గత ఏడాది ఆగస్టు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే ఈద్ సందర్భంగా అతను పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్‌కు శుభాకాంక్షలు చెబుతున్న 19 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జైలు నుంచి కూడా ఇలా స్వేచ్ఛగా పాకిస్థాన్ గ్యాంగ్స్టర్లతో మాట్లాడటాన్ని చంఢీగఢ్ శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిత తప్పుబట్టారు.కాగా, దేశ సరిహద్దుల్లో డ్రగ్ స్మగ్లింగ్‌తో పాటు పంజాబ్ గాయకుడు మూసేవాలను 2022లో హత్య చేసిన కేసుల్లో లారెన్స్ నిందితుడు. అంతేకాక, నటుడు సల్మాన్ ఖాన్‌పై ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కూడా బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని పోలీసులు తెలిపారు.