న్యూఢిల్లీ: జన్మదిన వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతర ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తన నమో భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్లను అద్దెకు ఇవ్వనున్నట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ) శనివారం ప్రకటించింది. కొత్త పాలసీ కింద వ్యక్తులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫోటోగ్రఫీ లేక మీడియా కంపెనీలు నడుస్తున్న లేక నిలిచిన నమో భారత్ బోగీలను బుక్ చేసుకోవచ్చని ఎన్సీఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
దుబాయి డిపోలో ఉన్న ఓ నమూనా కోచ్ కూడా షూటింగ్‌లకు అందుబాటులో ఉందని ప్రకటన పేర్కొంది. గంటకు రూ.5,000 చొప్పున నమో భారత్ కోచ్‌ను బుక్ చేసుకోవచ్చని, అలంకారాలను అమర్చేందుకు, తొలగించేందుకు విడిగా 30 నిమిషాలు కేటాయిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేసిన నమో భారత్ బోగీలు చిన్న చిన్న వేడుకలకు, ఫొటో షూట్లకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయని ఎన్సీఆర్టీసీ తెలిపింది.