Breast Cancer | న్యూఢిల్లీ: బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), రూర్కెలా సరికొత్త సెమీ కండక్టర్ పరికరం ఆధారిత బయోసెన్సర్‌ను అభివృద్ధి చేసింది. సంక్లిష్టమైన లేదా ఖరీదైన ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ అవసరం లేకుండానే ఈ విధానంలో బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. రసాయనాల అవసరం లేకుండానే ఈ బయోసెన్సర్ పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన రొమ్ము కణాలు, క్యాన్సర్ కణాల మధ్య తేడాను అత్యంత సమర్థంగా ఈ బయోసెన్సర్ గుర్తిస్తుంది.
రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బయోసెన్సింగ్ డివైజెస్‌తో పోల్చుకుంటే, ఇది మరింత కచ్చితంగా పని చేస్తుంది. ఈ పరిశోధన నివేదిక ప్రతిష్ఠాత్మక మైక్రోసిస్టమ్ టెక్నాలజీస్ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సాహు మాట్లాడుతూ, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్న దశ ప్రారంభంలో ఎటువంటి సంకేతాలు కనిపించవని చెప్పారు. క్యాన్సర్ నిరోధం, చికిత్స కోసం వీటిని ప్రారంభ దశలోనే నిర్ధారించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ కొత్త విధానంలో రొమ్ము క్యాన్సర్లను గుర్తించడం అందరికీ అందుబాటు ధరలో ఉంటుందని చెప్పారు.