Bihar | పాట్నా, సెప్టెంబర్ 13: తనపై జరిగిన గ్యాంగ్ రేప్ యత్నాన్ని ఓ నర్స్ సమయస్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన బీహార్‌లో జరిగింది. గంగాపూర్‌లోని ఆర్బీఎస్ హెల్త్‌కేర్ సెంటర్లో పనిచేస్తున్న నర్స్పై బుధవారం రాత్రి అదే దవాఖాన అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సంజయ్ కుమార్, అతడి ఇద్దరు సహాయకులు మద్యం తాగి లైంగిక దాడికి ప్రయత్నించారు. తనను రక్షించుకోవడానికి నర్స్ వెంటనే ఓ బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ భాగాలను కోసింది.
ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని దగ్గర్లోని పొలంలో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది. వారు వెంటనే అక్కడకు చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నర్స్పై లైంగిక దాడికి యత్నించే ముందు నిందితులు దవాఖానకు లోపలి వైపు తాళం వేసి సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని డీఎస్పీ పాండే తెలిపారు. వారి వద్ద మద్యం ఉండటంతో నిందితులపై ప్రొహిబిషన్ చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.