అతిపెద్ద మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించింది ఓ ముస్లిం కుటుంబం. బిహార్లోని కథివాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి సుమారు 2.5 కోట్ల విలువైన భూమిని ఓ ముస్లిం కుటుంబం విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిశోర్ కునాల్ ప్రకటించారు. తాము నిర్మించే ఆలయానికి గౌహతిలోని ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ కుటుంబం విలువైన భూమిని విరాళంగా ఇచ్చిందని, ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు.
ఈ విరాళానికి సంబంధించిన అన్ని ఫార్మలిటీలను కేశారియా రిజిస్ట్రార్ ఆఫీసులో పూర్తి చేసినట్లు కిశోర్ కునాల్ తెలిపారు. ముస్లిం కుటుంబ సహాయం లేకుంటే.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడం కష్టమయ్యేదని కిశోర్ కునాల్ అన్నారు. ఇప్పటి వరకూ ఈ ట్రస్ట్ మందిర నిర్మాణ నిమిత్తమై 125 ఎకరాల భూమిని పొందింది. మరో 25 ఎకరాల భూమిని కూడా ఇదే ప్రాంతంలో సేకరిస్తామని ట్రస్టీ పేర్కొన్నారు.