Ramcharitmanas | రాంచరిత్ మానస్‌పై బిహార్ విద్యాశాఖ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బిహార్‌లో వాతావరణాన్ని వేడెక్కించాయి. నలంద ఓపెన్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను విరమించుకుంటున్నట్లు ప్రకటించాలని ప్రతిపక్షాలు ఆందోళకు దిగాయి. బిహార్ విద్యామంత్రి దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఆయనను మంత్రిపదవి నుంచి తప్పించాలని అయోధ్యలోని జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్ చేశారు. ఆయన నాలుక కోసి తెచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ఈ విషయం తన దృష్టికి రాలేదని సీఎం నితీష్ కూల్‌గా చెప్పారు.
సమాజంలో కుల విభజనను ప్రోత్సహిస్తున్న రామచరిత్ మానస్‌ను మనుస్మృతి మాదిరిగానే తగలబెట్టాలని బిహార్ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు హిందూ సంస్థలు భగ్గుమన్నవి. బిహార్ రాజధాని సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. కాగా, ఆయనపై ఢిల్లీలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ కేసు నమోదు చేశారు. ఇలాఉండగా, తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ప్రొఫెసర్ చంద్రశేఖర్ మరోసారి స్పష్టం చేశారు.
విద్యామంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. ఆయనను వెంటనే మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మరోవైపు పట్నా, రోహతక్‌లో భజరంగ్‌దళ్ పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకున్నది. ఇలాఉండగా, మీ మంత్రి అలా ఎలా వ్యాఖ్యానించారని మీడియా సీఎం నితీష్‌కుమార్‌ను అడగ్గా.. ఈ కేసు తన దృష్టికి రాలేదని, సమాచారం అందిన తర్వాత స్పందిస్తానని సమాధానమిచ్చారు.