నవాడా, సెప్టెంబర్ 19: బీహార్లో దారుణం చోటు చేసుకుంది. దళితులకు చెందిన 34 ఇండ్లను దుండగులు తగలబెట్టారు. దీంతో పేద దళితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. నవాడా జిల్లా మంజి తోలలోని తోల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఎవరూ గాయపడలేదని, దీనికి కారకులుగా భావిస్తూ 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ దారుణాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)ను ఆదేశించారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, బీహార్లో జంగిల్ రాజ్ పాలనకు ఇది మరో నిదర్శనమని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. బహుజనులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన మరో అన్యాయమని విపక్షాలు విమర్శించాయి.
దహనమైన ఇండ్లు 80 వరకు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొంత మంది వ్యక్తులు రాత్రి ఏడు గంటలకు వచ్చి గాలిలోకి కాల్పులు జరిపి తమ ఇండ్లను తగులబెట్టారని చెప్పారు. కాగా, భూ వివాదమే దీనికి కారణంగా భావిస్తున్నట్టు ఎస్పీ అభినవ్ దిమాన్ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే బాధితుల తాత్కాలిక నివాసానికి టెంట్లు ఏర్పాటు చేశామని, ఆహారం, మంచినీరు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేసినట్టు చెప్పారు. దళితుల ఇండ్ల దహనాన్ని కేంద్ర మంత్రి జితిన్ రాం మాంఝీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు.
శాంతిభద్రతలు కుప్పకూలాయి: లాలూ
బీహార్లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, ఇది కచ్చితంగా నితీశ్ కుమార్ పాలనా వైఫల్యమేనని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. ‘ మీ హయాంలో దళితుల ఇండ్లను దుండగులు తగులబెడుతున్నారు. దీనిపై మీరు కానీ, నితీశ్ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడరు’ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు.