లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో ( Hathras stampede) కుట్ర జరిగిందని భోలే బాబా తరుపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. సుమారు 15 మంది వ్యక్తులు విషం చల్లి తొక్కిసలాటను ప్రేరేపించి పారిపోయారని ఆరోపించారు. జూలై 2న భోలే బాబా సత్సంగం కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది భక్తులు మరణించారు. ఆయన తరుపు న్యాయవాది ఏపీ సింగ్ దీని గురించి మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట జరగడానికి కొందరు కుట్రదారులు ప్లాన్ చేశారని ఆరోపించారు. ‘హృదయ విదారకమైన సంఘటన జరిగింది. కుట్రలో 15 నుంచి 16 మంది పాల్గొన్నారు. గుర్తుతెలియని కొన్ని వాహనాలు తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్నాయి’ అని అన్నారు.
కాగా, సుమారు 10 నుంచి 12 మంది వ్యక్తులు భక్తులపై విషం చిమ్మారని లాయర్ ఏపీ సింగ్ ఆరోపించారు. ‘మహిళలు పడిపోయారని, ఊపిరి ఆడక చాలామంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు (కుట్రదారులు) అక్కడి నుంచి పారిపోయారు. సిట్, హత్రాస్ ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలి. అంతా ప్లాన్డ్గా జరిగింది’ అని అన్నారు.
మరోవైపు భోలే బాబాపై కేసు నమోదు కావడంపై న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. తన క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని పీటీఐతో అన్నారు.