న్యూఢిల్లీ: బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను(Synthetic Antibody) తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టడీని ఇటీవల జర్నల్ సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించారు.
హెచ్ఐవీ, కోవిడ్-19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్ కోసం వాడిన విధానాన్ని.. సింథటిక్ యాంటీబాడీలు తయారు చేసేందుకు అనుసరించారు. ఆ ప్రక్రియలోనే విషాన్ని నిర్వీర్యం చేసే కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. తొలిసారి ఆ టెక్నిక్ ద్వారా పాము కాటుకు చికిత్స చేస్తున్నట్లు ఐఐఎస్ పీహెచ్డీ విద్యార్తి సెంజి లక్ష్మి తెలిపారు.
అమెరికాకు చెందిన స్క్రీప్స్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కూడా ఆ బృందంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విష సర్పాల నుంచి రక్షణ పొందే రీతిలో యూనివర్సల్ యాంటీబాడీని డెవలప్ చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోబ్రా, కింగ్ కోబ్రా, క్రెయిట్, మాంబా లాంటి ప్రమాదకర సర్పాలు ఆ లిస్టులో ఉన్నాయి.
విషం విరుగుడు కోసం తయారు చేసిన ముందులో కేవలం 10 శాతం మాత్రమే యాంటీబాడీలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. విషంలో ఉండే కీలకమై త్రి ఫింగర్ టాక్సిన్(3ఎఫ్‌టీఎక్స్)ను కొత్తగా డెవలప్ చేసిన కృత్రిమ యాంటీబాడీ టార్గెట్ చేస్తుందని ఐఐఎస్సీ ప్రొఫెసర్ కార్తీక్ సునగర్ తెలిపారు. బలమైన కోరలు వున్న వేర్వేరు పాములు రకరకాల విషాన్ని చిమ్ముతుంటాయని, అయితే ఆ విషాల్లోని ప్రోటీన్ భాగం కొంత వరకే ఒకరకంగా ఉంటుందని సునగర్ తెలిపారు.
ప్రస్తుత పరిశోధకులు ప్రకారం మొత్తం 149 రకాల 3ఎఫ్‌టీఎక్స్ వేరియంట్లు ఉన్నాయి. అయితే కొత్తగా డెవలప్ చేసిన సింథటిక్ యాంటీబాడీ, వీటిల్లో 99 రకాల విషాలను నిర్వీర్యం చేయగలదని పరిశోధకులు తెలిపారు. నాగుపాము విషంపై కూడా పరిశోధకులు పరీక్షలు చేశారు. ఈశాన్య భారతంలోని నాగుపాములు, సహారాలోని బ్లాక్ మాంబా పాము విషలను స్టడీ చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే సంప్రదాయకరమైన యాంటీబాడీల కన్నా.. ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ యాంటీబాడీ దాదాపు 15 రెట్లు అధిక సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తులు గుర్తించారు.