బెంగళూరు : కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండ్ల డిపాజిట్ మొత్తాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళ ఇండ్ల యజమానులు భారీ డిపాజిట్లను అడగడంపై తన నైరాశ్యాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఒక ఇంటి యజమాని రూ.40 వేల అద్దె గల ఫ్లాట్‌కు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసినప్పుడు తాను విస్తుపోయానని ఆమె ఈ పోస్ట్ పెట్టారు.
అద్దె ఇంటి కోసం తాను చేస్తున్న పోరాటాన్ని, అద్దెదారులు చెల్లించాల్సిన డిపాజిట్లపై ఉండాల్సిన పరిమితిపై తన వాదనను హర్నిధ్ కౌర్ అనే మహిళ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. డిపాజిట్ చెల్లించడం కన్నా ఒక ఇల్లు కొనుక్కోవడం మేలని సూచించారు. ఒక సంవత్సరం మొత్తం అద్దె కన్నా డిపాజిట్ ఎక్కువ అడుగుతున్నారని విమర్శించారు.