Bengaluru Rains | బెంగళూరులో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరింది. నగరంలోని కేఆర్ సర్కిల్లోని అండర్‌పాస్ వద్ద వర్షం నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. కారులో ఉన్న వారిని రక్షించారు. కారు నీటిలో మునగడంతో అస్వస్థతకు గురైన భాను రేఖ (23) మృతి చెందింది. వరద నీటిలో చిక్కుకున్న సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మృతురాలిని ఏపీ విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. భాను రేఖ బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నది.
సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురవడంతో కేఆర్ సర్కిల్ వద్ద అండర్‌పాస్‌లో భారీగా వరద నీరు చేరింది. కారు నీటిలో చిక్కుకుపోవడంతో సకాలంలో పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టి.. రక్షించారు. అస్వస్థతకు గురైన భాను రేఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే, పలు కార్లు సైతం అండర్‌పాస్‌లో చిక్కుకుపోగా.. పోలీసులు కాపాడి దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడంతో పాటు సెంట్ మార్థస్ ఆసుపత్రిని సందర్శించారు.