బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆరేండ్ల క్రితం జరిగిన ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను తెచ్చిన మంచూరియా తినేందుకు నిరాకరించిందన్న కోపంతో సంజ్య్ వాసుదేవ రావు అనే 27 ఏండ్ల యువకుడు తన అమ్మమ్మ శాంతకుమారి (70)ని కర్రతో కొట్టాడు. దాంతో తలకు గాయమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. సంజయ్ తల్లి శశికళ ముందే ఇదంతా జరిగింది.
విషయం బయటికి తెలిస్తే కేసు అవుతుందని భయపడి సంజయ్ తన స్నేహితుడు నందీశ్‌ను ఇంటికి పిలిచాడు. సంజయ్, శశికళ, నందీశ్ ముగ్గురు కలిసి ఇంట్లోనే గోడ కింద రంధ్రం చేసి ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాత సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి, పెయింట్ వేశారు. 2016 ఆగస్టులో ఈ ఘటన జరుగగా, 2017 ఫిబ్రవరిలో సంజయ్, శశికళ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
అదే ఏడాది మే నెలలో ఆ ఇంటి ఓనర్ ఇంటిని రిపేర్ చేయిస్తుండగా అస్తిపంజరం బయటపడింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. హత్య విషయం బయటపడింది. దాంతో బెంగళూరులోనే ఉన్న నందీశ్‌ను అదుపులోకి తీసుకుని ఏ3 ముద్దాయిగా కేసు బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్, శశికళ అచూకీ లభ్యం కాలేదు.
వారి కోసం పోలీసులు ఏండ్లుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు మహారాష్ట్రలో ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో పోలీసులు మహారాష్ట్రలో గాలింపు చేపట్టారు. అన్ని కోణాల్లో నిందితుల ఆచూకీకి ప్రయత్నించారు. చివరికి సంజయ్ బ్యాంక్ అకౌంట్ కోసం ఇచ్చిన కేవైసీ ద్వారా ఇటీవల వారి అడ్రస్ దొరికింది. సంజయ్ ఓ హోటల్లో వెయిటర్‌గా, శశికళ పనిమనిషిగా చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.