బెంగళూరు, జూలై 10: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందనడానికి ఈ ఫుట్‌పాతే ప్రత్యక్ష సాక్ష్యం. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్డులో ఇటీవల నిర్మించిన ఫుట్‌పాత్ కొన్ని వారాల్లోనే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇందుకు సంబంధించి నగర పౌరుడు ఒకరు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్మించిన ఫుట్‌పాత్ జూన్ నెలాఖరుకల్లా గుంతలమయంగా మారిపోయింది.
వెంటనే దాన్ని మరమ్మతు చేయడానికి చేపట్టిన చర్యలు మరింత అధ్వానంగా మార్చాయి. జూలై 6న తీసిన ఫొటోలలో ఫుట్‌పాత్‌పై అమర్చిన టైల్స్ అస్తవ్యస్తంగా మారి నడవలేని దుర్భర పరిస్థితి ఏర్పడింది. నాసిరకం పనులపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్డులోని ఫ్యాబ్ ఇండియా వద్ద ఫుట్‌పాత్‌పై గనుల తవ్వకాన్ని చేపట్టినందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ), సంబంధిత ఇతర బృందాలకు ధన్యవాదాలు అంటూ ఆ పౌరుడు వ్యంగ్యాస్ర్తాలు సంధించాడు.