Bengaluru doctor : రన్నింగ్ ఫ్లైట్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళా ప్రయాణికురాలిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాపాడారు. విమానం గాల్లో ఉండగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆమెకు అదే విమానంలో ప్రయాణిస్తున్న ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ అంజలి నింబాల్కర్ (Anjali Nimbalkar) సీపీఆర్ చేసి కాపాడారు.
అంజలి గతంలో కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆమె ప్రయాణికురాలిని కాపాడటంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసలు కురిపించారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆమెను ప్రశంసిస్తూ ఒక ప్రకటన చేసింది. శనివారం మధ్యాహ్నం గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే ప్రయాణికురాలు అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అది చూసిన డాక్టర్ అంజలి వెంటనే స్పందించారు. జెన్నీకి సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్టు సిబ్బంది సదరు ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకు అంజలి ఆమెతోనే ఉన్నారు.