Bank Holidays in March | బ్యాంకుతో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడం దగ్గర్నుంచి.. లోన్లు, క్యాష్ విత్‌డ్రా, ఇతర పనుల కోసం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఒక్కోసారి బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే.. మూడు నాలుగు రోజుల దాకా మూతపడిపోతాయి. అటువంటి సమయాల్లో ఏదైనా బ్యాంకు పని ఉంటే చాలా కష్టం అవుతుంది.
అందుకే.. బ్యాంకులకు ఏవైనా సెలవులు ఉన్నాయని తెలిస్తే వెంటనే బ్యాంకు పని పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంకులు తిరిగి తెరుచుకునేదాకా వెయిట్ చేయాల్సిందే. మార్చి నెలలోనూ బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి.
మార్చిలో ముఖ్యమైన పండుగ అంటే హోలీనే. హోలీ పండుగ రోజున దాదాపు అన్ని బ్యాంకులు మూత పడతాయి. అయితే.. ఈసారి హోలీ మార్చి 18న వస్తోంది. అంటే శుక్రవారం. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 17నే జరుపుకోబోతున్నారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో మార్చి 19న కూడా హోలీని జరుపుకోనున్నారు. మార్చి 20న ఆదివారం రానుంది.
అంటే మొత్తం మీద మార్చి 17 నుంచి మార్చి 20 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో సెలవులు రానున్నాయి. మార్చి 16 న బుధవారం వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. ఆ తర్వాత మార్చి 21న సోమవారం ఓపెన్ అవుతాయి.
మార్చి 17న హోలికా దహన్ ఫెస్టివల్‌ను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుపుకోనున్నారు. మార్చి 18న అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చంఢీగర్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచి, షిల్లాంగ్, శ్రీనగర్‌లో హోలీ వేడుకలను జరుపుకోనున్నారు. మార్చి 19న ఒడిశా, మణిపూర్, బీహార్‌లో హోలీ లేదా యోసాంగ్ అనే ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. అలా.. మార్చిలో హోలీ పండుగ వల్ల నాలుగు రోజులు వరుసగా కొన్ని రాష్ట్రాల్లో సెలవులు రానున్నాయి.