Banke Bihari Temple : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం బృందావన్‌లోని ఓ ఆలయ దర్శన వేళల్లో మార్పులకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం (Banke Bihari temple) లో దర్శన వేళలు, పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడంపై అసహనం వ్యక్తంచేసింది.
దేవుని విశ్రాంతి వేళల్లో ప్రత్యేక పూజలు చేయడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తునకు ఉన్నతస్థాయి ఆలయ నిర్వహణ కమిటీని నియమించింది. బాంకీ బిహారీ ఆలయంలో దర్శన వేళల్లోనే కాకుండా.. పలు మతపరమైన పూజా విధానాల్లోను మార్పులు చేస్తున్నట్లు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, న్యాయవాది తన్వి దూబే కోర్టుకు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుడికి విశ్రాంతి వేళలు ఉంటాయని, కానీ ఆ సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దేవతలకు విశ్రాంతినివ్వకుండా ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆచారం ప్రకారం వస్తున్న పవిత్రమైన ఆలయ నియమాలను, సమయాలను పాటించాలని అధికారులను ఆదేశించింది.