కాన్పూర్: విడాకులు తీసుకున్న బిడ్డ నిర్ణయాన్ని ఆమె తండ్రి గౌరవించారు. పెండ్లినాడు ఎలాగైతే అత్తగారింటికి బిడ్డను బ్యాండుమేళంతో సాగనంపాడో.. విడాకులు తీసుకున్న కూతురును అలాగే మేళతాళాలతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తాజాగా చోటుచేసుకున్నది. కాన్పూర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన అనిల్‌కుమార్ తన కుమార్తె ఉర్వి (36)ని ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి 2016లో ఘనంగా వివాహం జరిపించారు.
వీరి కాపురం కొన్నేండ్లు సక్రమంగా సాగింది. వీరికి కూతురు జన్మించింది. వరకట్నం కోసం ఉర్వి అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉర్వి విడాకులు కోరగా, కోర్టు ఇటీవల మంజూరు చేసింది. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టు నుంచి బ్యాండు మేళాలతో బిడ్డను కాన్పూర్‌లోని పుట్టింటికి తీసుకొచ్చారు. సమాజానికి సానుకూల సందేశం పంపించడానికే తాను బ్యాండ్‌మేళంతో బిడ్డను ఇంటికి తీసుకొచ్చానని తండ్రి అనిల్‌కుమార్ తెలిపారు.