భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మధ్య చర్చలు జరుగుతున్నాయా? ఇరు దేశాల మధ్య తిరిగి స్నేహ పూరిత వాతావరణం తలెత్తుతోందా? అంటే పాక్‌లోని మీడియా అవుననే అంటున్నాయి. ఇరు దేశాల కూడా తెర వెనుక చర్చలు చేసుకుంటున్నాయని నిశాత్ గ్రూప్ చైర్మన్ మహ్మద్ మంశా వెల్లడించారు. లాహోర్ వేదికగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమావేశంలో మహ్మద్ మంశా ఈ అంశాన్ని పేర్కొన్నారు. అంతా సవ్యంగా సాగిపోతే వచ్చే నెలలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పర్యటనకు వస్తారని కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య తిరిగి సంబంధాలు మెరుగుపడాలంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు. ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడకుంటే మాత్రం రానున్న రోజులు గడ్డురోజులేనని ఆయన హెచ్చరించారు. వెంటనే పాకిస్తాన్ భారత్‌తో వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూరప్ కూడా రెండు దేశాలను ఎదుర్కొందని, చాలా ఇబ్బందులు పడిందని, ఆ తర్వాత చివరకు శాంతి, అభివృద్ధి పథంలోనే పయనించిందని నిశాత్ గ్రూప్ చైర్మన్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఎప్పటికీ అలాగే వుండదని, ఎప్పుడో ఒకప్పుడు మార్పు తథ్యమని నిశాత్ గ్రూప్ చైర్మన్ మహ్మద్ మంశా ఆశాభావం వ్యక్తం చేశారు.