భువనేశ్వర్: భారత్ సాధించిన చంద్రయాన్-3 విజయాన్ని కొందరు తల్లిదండ్రులు వినూత్నంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన సమయంలో పుట్టిన తమ బేబీస్‌కు చంద్రయాన్ (Chandrayaan Babies)కు సంబంధించిన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చంద్రుడ్ని సూచించే పేర్లను సెలెక్ట్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు భారత్ చంద్రుడిపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన సమయంలో ఒడిశాలోని కేంద్రపరా జిల్లా ఆసుపత్రిలో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ముగ్గురు బాబులు, ఒక పాప ఉన్నారు.
కాగా, ఒకవైపు చంద్రయాన్-3 సక్సెస్, మరోవైపు అదే సమయంలో తమకు పిల్లలు జన్మించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తమ బిడ్డలకు చంద్రయాన్‌కు సంబంధించిన పేర్లు పెడతామని మీడియాకు తెలిపారు. తమ బాబుకు చంద్ర లేదా లూనా అని నామకరణం చేస్తామని తల్లి రాణు తెలిపింది. అలాగే చంద్రయాన్ మిషన్‌కు సంబంధించిన ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞా’ వంటి పేర్లను మరికొంత మంది తల్లిదండ్రులు పరిశీలిస్తున్నారు. శిశువుల తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపట్ల ఆ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.