Baba Siddique : అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దుండగులు నైన్ ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొనఊపిరితో ఉన్న ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మరణించారు. ఈ నేపథ్యంలో బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
కాగా, సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సిద్ధిఖీని అంతమొందించేందుకు నిందితులు నెల రోజులుగా రెక్కీ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సిద్ధిఖీ హత్య కోసం నిందితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు వెల్లడైంది. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాలు అందించినట్టు తెలిసింది.
హత్యకు గురైన బాబా సిద్ధిఖీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ను ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సన్నిహితుడినే హత్య చేసిన నేపథ్యంలో, సల్మాన్ ఖాన్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వారిని రెండు వారాల కస్టడీకి అప్పగించాలని కోరారు.