Ayodhya | విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య రామయ్య ఆలయం ముస్తాబవుతున్నది. జనవరి 22న శ్రీరామ జన్మభూమి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నది. శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని కలిపే ప్రధాన మార్గాలన్నింటిలో రామాయణ కాలం నాటి కీలకమైన ఘట్టాలను అందంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సీఎం యోగి ఆదేశాల మేరకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ADA) రామజన్మభూమి ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారుల గోడలపై కళాఖండాలను అలంకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలతో అయోధ్య నగరాన్ని సుందరీకరించనున్నారు. టెర్రకోట కళాఖండాలు తొమ్మిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి. టెర్రకోట మ్యూరల్ ఇనిషియేటివ్ అయోధ్య డెవలప్మెంట్ హిస్టారిక్ సిటీ సర్క్యూట్స్, హెరిటేజ్ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. టెర్రకోట కళాకండాలు తొమ్మిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో 50కిపైగా కుడ్య శిల్పాలు, మ్యూరల్ పెయింటింగ్స్ ఉండనున్నాయి. వీటిని రామాయణ ఘట్టాల ఆధారంగా తీర్చిదిద్దనున్నారు.
నదీ గర్భంలో నుంచి సేకరించిన నాణ్యమైన బంకమట్టిన మాత్రమే ఇందుకు వినియోగించనున్నారు. ఇదిలా ఉండగా.. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరుగనున్నది. నాలుగు దశల్లో వేడుకలను నిర్వహించనున్నారు. తొలిదశలో కార్యాచరణ సిద్ధం చేస్తారు. రెండో దశలో 10కోట్ల కుటుంబాలకు రామయ్య అక్షింతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేస్తారు. మూడో దశలో జనవరి 22న దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాల్గో దశలో జనవరి 26 నుంచి భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పించనున్నారు.