భోపాల్: ఊరికి వెళ్తున్న పోలీస్ అధికారిని ఆటో డ్రైవర్ హత్య చేశాడు. (Auto Driver Kills Police) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడ్ని ఆటో డ్రైవర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుస్తంజీ ఆర్మ్డ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్న 58 ఏళ్ల పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రభాత్ నారాయణ్ చతుర్వేది తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో జనవరి 23-24 తేదీల మధ్య రాత్రివేళ ఊరికి వెళ్లడం కోసం ఆటోలో బస్టాండ్‌కు బయలుదేరాడు.
కాగా, పోలీస్ అధికారి ప్రభాత్ నారాయణ్, ఆటో డ్రైవర్ కలిసి మార్గమధ్యలో ఒకచోట మద్యం సేవించారు. మద్యం మత్తులో వారిద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ బండరాయితో మోది పోలీస్ అధికారిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒకచోట పడేసి పారిపోయాడు. పోలీస్ అధికారి మిస్సింగ్‌పై అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీనిక్స్ మాల్ సమీపంలో ఒక మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పరిశీలించగా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రభాత్ నారాయణ్ చతుర్వేదిగా గుర్తించారు. దీంతో ఆయన హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కాగా, పోలీస్ అధికారి ఇంటి నుంచి ఆయన మృతదేహం లభించిన ప్రాంతం వరకు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఆటో డ్రైవర్, ఆ పోలీస్ అధికారి మద్యం సేవించినట్లు గ్రహించారు. నిందితుడైన 27 ఏళ్ల ఆటో డ్రైవర్ దేవేంద్ర బురాసిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి ఆటోను స్వాధీనం చేసుకున్నారు.