నేషనల్ డెస్క్: బీజేపీకి అధికార దాహం ఎక్కువైపోయింది. ప్రజాస్వామ్యం అన్నా.. ప్రజల తీర్పు అన్నా బీజేపీకి లెక్కే లేదు.. అధికారాన్ని చేజిక్కించుకోవడం.. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం.. ప్రతిపక్షాలను నామరూపాల్లేకుండా చేయడం.. ము ఖ్యంగా కాంగ్రెస్‌లో లుకలుకలు సృష్టించి ఆగం పట్టించడం.. ఇదే కమలం పార్టీ ముందున్న ఎజెండా. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నది. బీజేపీయేతర పార్టీలు, నేతలపై సా మ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉండనే ఉన్నాయి. వాటిని తమతో పొసగని నేతలపై అలా వదిలితే చాలు.. ఇలా వచ్చి బుట్టలో పడుతుంటారు. వెంటనే జీ హుజూర్ అంటూ బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఏం జరిగిందో చూశాం. ఇక జార్ఖండ్, గోవా, హర్యానాలో కూడా ఇలాగే చేయాలని బీజేపీ కాచుకుని కూర్చుంది.
సేన ఎంపీల్లోనూ చీలిక?
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల మధ్య చీలిక తెచ్చి పండుగ చేసుకున్న కేంద్రంలోని బీజేపీ.. ఇక ఆ పార్టీ ఎంపీల్లోనూ చీలిక తేనున్నది. మొత్తం 19 మంది ఎంపీల్లో 14 మంది పార్టీలో చీలిక వర్గంగా ఏర్పడనున్నట్టు సమాచారం. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ రెండు, మూడు రోజుల్లో లోక్‌సభ స్పీకర్‌ను కోరనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అలా అయితే శివసేన విప్‌ను ధిక్కరించినా అనర్హత వేటుకు గురికారు.
నెక్ట్స్ టార్గెట్ జార్ఖండ్?
జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ దండోపాయం అమలు చేస్తున్నది. కేంద్రదర్యాప్తు సంస్థలు ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై కేసులు పెట్టగా, బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితేనే కేసులు మాఫీ అవుతాయని హేమంత్ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించారు. ఆమె గిరిజన మహిళ అని, జార్ఖండ్ మాజీ గవర్నర్ కాబట్టి ఆమెకు మద్దతు ఇస్తున్నామంటూ బయటకు కలరింగ్ ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
గోవాలో హైడ్రామా..
గోవా కాంగ్రెస్‌లో లుకలుకలు సృష్టించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎట్టకేలకు ఆదివారం నాటి హైడ్రామాకు తెరపడింది. కనిపించకుండా పోయిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, అంతా సద్దుమణిగిందని కాంగ్రెస్ ప్రకటించింది. ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.40 కోట్లు ఆఫర్ చేసిందని, అయినా కూడా తమ ఎమ్మెల్యేలు ఆ డబ్బుకు లొంగలేదన మాయలో పడలేదని గోవా పీసీసీ చీఫ్ గిరీశ్ పేర్కొన్నారు. అయితే బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్‌లో చీలిక తెచ్చేందుకు యత్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబోలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కాంగ్రెస్ సభాపక్షం కోరడం గమనార్హం. అయితే తాము వేరే పార్టీలోకి మారబోమంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దేవుళ్లపై ప్రమాణం చేశారు. అయినా కూడా బీజేపీ హైడ్రామాను నడిపించింది.
హర్యానాలో ఆగమాగం
హర్యానాలో కాంగ్రెస్‌లో లుకలుకలు తెచ్చేందుకు కుట్ర జరుగుతున్నది. దీనికి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలప్పుడే బీజం పడినట్టు తెలుస్తున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాకుండా క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. కుల్దీప్ను కాంగ్రెస్ ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.