
దొంగతనం అంటగట్టి చిత్ర హింసలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అరోపణతో దళిత బాలికపై ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారు. కర్రలతో విపరీతంగా కొట్టడంతో పాటు జుట్టులాగి, నేలపై ఈడ్చిపడేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. బాధిత బాలికను ఇద్దరు వ్యక్తులు నేలపై అదిమిపట్టగా, మరో వ్యక్తి కర్రతో విచక్షణారహితంగా ఆమె కాలిపై కొడుతున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. నొప్పి, బాధతో ఏడుస్తూ.. నన్ను వదిలేయండి! అని వేడుకొన్నా కూడా వారు వదలకుండా కర్కశంగా వ్యవహరించారు. ముగ్గురు మహిళలు కూడా ఆ బాలికను ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. నిందితులపై పోక్సోతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని, మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని సర్కిల్ ఆఫీసర్ అర్పిత్ కుమార్ బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.