న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో వివాదం రేగింది. అధికారికంగా కేటాయించకుండానే సీఎం ఆతిశీ సీఎం బంగ్లాను అనధికారికంగా ఆక్రమించారన్న ఆరోపణలతో రెండు రోజుల క్రితం దిగిన ఆమెను ఎల్జీ ఆదేశాలతో బలవంతంగా ఖాళీ చేయించారు. ఆమెకు సంబంధించిన సామాన్లను అక్కడి నుంచి తరలించారు. ఎల్జీ చర్యపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఇది చాలా అగౌరవ చర్య అని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ ఇలాంటి అవమానం జరగలేదని విమర్శించింది. రెండు రోజుల క్రితమే అధికారిక నివాసంలో దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని ఇంటి నుంచి గెంటేశారని అధికార ఆప్ బుధవారం ఆరోపించింది. దీనిపై ఎల్జీ కార్యాలయం వివరణ ఇస్తూ అది సీఎం నివాసం కాదని, దానిని ఎవరికైనా కేటాయించవచ్చునని తెలిపింది. అధికారికంగా ఆ మెకు ఆ నివాసం కేటాయించకపోయినా నిబంధనలను అతిక్ర మించి దానిని ఆక్రమించుకున్నారని పేర్కొంది.
ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని 6 నంబర్ ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్లో మాజీ సీఎం కేజ్రీవాల్ తొమ్మిదేండ్లుగా నివసిస్తున్న గృహాన్ని ఖాళీ చేయడంతో కొత్త సీఎం ఆతిశీ అందులో సోమవారం దిగారు. అయితే బంగ్లాను పీడబ్ల్యూడీ శాఖ ఇంకా ఎవరికీ కేటాయించ లేదని బీజేపీ ఆరోపించింది. ఆ నివాసంలోకి ఆమె ఎలా దిగుతారని ప్రశ్నించింది. కేజ్రీవాల్ ఈ బంగ్లాను ఖాళీ చేసినట్టు డాక్యుమెంట్ రుజువు ఉన్నప్పటికీ ఈ అంశంపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీ దొడ్డిదారిలో బంగ్లాను ఆక్రమించుకోవడానికి ప్రయ త్నం చేస్తున్నదని, దానికి ఒక బీజేపీ నేతకు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.