టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ హిల్ కౌంటీని శుక్రవారం తెల్లవారుజామున ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో కనీసం 27 మంది మరణించగా మరో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. గ్వాడలూప్ నది ఒడ్డున క్యాంప్ మిస్టిక్‌లో ఆల్ గర్ల్స్ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్‌లో ఉన్న 23 బాలికలు ఆకస్మిక వరదల్లో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 750 మంది బాలికలు ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొంటున్నారు. గల్లంతైన బాలికల కోసం హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్ల ద్వారా గాలింపు జరుగుతోంది. గ్వాడలూప్ నది ప్రవాహం పెరిగి 2 గంటల్లో 22 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. ఉధృత నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్న ఇళ్లు నీట మునగగా వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలు ఇళ్లపైకి, చెట్లపైకి చేరుకున్నారు. ఆకస్మిక వరదలకు 27 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.