Junmoni Rabha | ‘లేడీ సింగం’గా పేరొందిన అసోం మహిళా ఎస్సై జున్ మోనీ రభా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నాగాన్ జిల్లాలో పలు వివాదాలకు మారు పేరుగా నిలిచిన జున్ మోనీ రభా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్స్ జున్ మోనీ రభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని రభా కారు ఢీకొట్టింది. జాఖాలబంధా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుబుగియా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కారులో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న జున్ మోనీ రభాను చికిత్స కోసం దవాఖానకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. సివిల్ డ్రస్ లో ఉన్న జున్ మోనీ రభా.. ఆ టైంలో ఒంటరిగా ఎక్కడికెళ్తున్నారన్న సంగతి తెలియలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అసోం పోలీసు విభాగం అధికారిగా జున్ మోనీ రభా.. నాగాన్ జిల్లాలో ఎస్సైగా విధుల నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. తనదైన పనితీరుతో ఈ ప్రాంత ‘లేడి సింగం’, ‘దబాంగ్ పోలీస్’ అని పేరూ తెచ్చుకున్నారు.. పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతేడాది జూన్ లో అరెస్టయ్యారు. కొంతకాలం సస్పెన్షన్ లో ఉన్న జున్ మోనీ రభా.. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత డ్యూటీలో చేరారు. గతంలో ఒక బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ కూడా వివాదస్పదంగా మారింది.
జున్ మోనీ రభా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టగానే కంటైనర్ డ్రైవర్ పారిపోయాడని చెబుతున్నారు. ఎగువ అసోం వైపు జున్ మోనీ రభా వెళుతున్నారని, క్లూ లెస్ అని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆమె కదలికల పట్ల తమకు సమాచారం లేదని జున్ మోనీ రభా తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు కుట్ర కోణం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.