న్యూఢిల్లీ: మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితి మణిపూర్లో నెలకొన్నదని అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ పీసీ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాల వాడకం పెద్ద ఎత్తున ఉందని, హింస చెలరేగడానికి ఇది ముఖ్య కారణమవుతున్నదని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్మీ మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితిని మణిపూర్లో ఎదుర్కొనలేదు. ఇదంతా కొత్తగా కనిపిస్తున్నది.
1990ల్లో నాగా, కుకీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే ఆనాటి ఘర్షణలు, హింస ఆ రెండు గ్రూపులకే పరిమితం’ అని ఆయన నాయర్ అన్నారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాల వాడకం పెద్ద ఎత్తున ఉందని, దీంతో ఆర్మీ అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని వివరించారు. వీటిని స్వాధీనం చేసుకోకపోతే సమస్య పరిష్కారం చేయలేమన్నారు. గత కొన్ని నెలలుగా మణిపూర్లో చెలరేగుతున్న హింస, అల్లర్లపై దేశం యావత్తు కలవరపాటుకు గురవుతున్నది. అధికారిక లెక్కల ప్రకారం, హింసాత్మక ఘటనల్లో కనీసం 160 మంది చనిపోయారు. దుండగులు 2 వేల గ్రామాలకు నిప్పుపెట్టారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్.. అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు మణిపూర్ హింసపై సమాధానం చెప్పటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఆయుధాలతో దుండగులు చెలరేగిపోవటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.