గువాహటి: ప్రధాని మోదీని ‘నరేంద్ర గౌతమ్‌దాస్ మోదీ’ అని వివాదస్పదంగా సంబోధించారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఖేడా రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీకి వెళ్తుండగా, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆయనను విమానం నుంచి దింపి అదుపులోకి తీసుకొన్నారు. దీంతో ఎయిర్‌పోర్టులో కాసేపు హైడ్రామా చోటుచేసుకొన్నది. అరెస్టు విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో నిరసన చేపట్టి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ ఇంటి పేరు, తండ్రిని అవమానిస్తూ పవన్ మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ అరెస్టుపై వివరణ ఇవ్వాలని అస్సాం పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.