నల్బరీ: ఎవరికైనా పట్టరాని సంతోషం కలిగితే ఎగిరి గంతేస్తారు. అస్సాం నివాసి మాణిక్ అలీ మాత్రం పాలతో స్నానం చేశాడు. తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛ తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. తన భార్యతో చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత ఆయన ఈ ‘ఉత్సవం’ చేసుకున్నారు! తన ఇంటి బయట నాలుగు బకెట్ల పాలతో స్నానం చేస్తూ ‘నేను ఈ రోజు నుంచి స్వేచ్ఛా జీవిని’ అంటూ అతడు కేరింతలు కొట్టడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
‘ఆమె తరచూ తన ప్రియుడితో లేచి పోయేది. మా కుటుంబ శాంతి కోసం నేను మౌనంగా ఉండేవాడిని’ అని అతడు ఓ వీడియోలో వివరించాడు. ‘నా భార్యతో నాకు విడాకులు ఖరారయ్యాయని నిన్ననే నా న్యాయవాది చెప్పారు. అందుకే నాకు లభించిన స్వేచ్ఛను ఇవాళ పాలతో స్నానం చేసి సంబరం చేసుకుంటున్నా’ అని అతడు తెలిపాడు. స్థానికుల కథనం ప్రకారం అలీ భార్య రెండుసార్లు ప్రియుడితో వెళ్లిపోయింది.